English
தமிழ்
हिन्दी
తెలుగు
ಕನ್ನಡ
శబరిమలలో ప్రధాన తీర్థయాత్ర కాలం నవంబరు నుండి జనవరి వరకు సాగుతుంది.
శబరిమల తీర్థయాత్ర
శబరిమల శ్రీ ధర్మ శాస్తా ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన మరియు భక్తులతో రద్దీగా ఉండే అటవీ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఒకానొక సమయంలో ఇది ప్రపంచంలోనే అత్యధిక మంది భక్తులను ఆకర్షించిన ఆలయంగా కూడా ప్రసిద్ధిగాంచింది. కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలోని పశ్చిమ కనుమ పర్వత శ్రేణుల్లో ఉన్న పెరియార్ టైగర్ రిజర్వ్ అడవుల్లో కొండశిఖరంపై ఈ పుణ్యక్షేత్రం ఉంది. అనధికారిక రికార్డుల ప్రకారం ఏటా మూడు నుంచి ఐదు కోట్ల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. శ్రీ ధర్మశాస్తా అని కూడా పిలిచే అయ్యప్ప స్వామి ఈ ఆలయంలో ప్రధాన దైవం. అయ్యప్ప స్వామి ఆత్మ శబరిమలలో ధర్మశాస్తాతో ఐక్యమైనట్లుగా భక్తులు విశ్వసిస్తారు.
శబరిమలలో ఉండే ఆచారాలు మరియు సంపరదాయాలు ఈ దేవాలయాన్ని భారతదేశంలోని ఇతర దేవాలయాలకంటే భిన్నంగా నిలిపాయి. ఈ ఆలయాన్ని సంవత్సరం పొడవునా భక్తులు మరియు పూజల కొరకు తెరవబడదు. ఆలయాన్ని తెరిచే మరియు మూసివేసే రోజులను మలయాళం క్యాలెండర్ ప్రకారం నిర్ధారిస్తారు. ఈ దేవాలయం యొక్క ప్రధాన తీర్థయాత్ర కాలాలు మండలపూజ మరియు మకరవిళక్కు.
శబరిమలలో అత్యంత ముఖ్యమైన తీర్థయాత్ర సీజన్ మలయాళ మాసం వృశ్చికం (నవంబర్-డిసెంబర్) మొదటి రోజున ప్రారంభమవుతుంది, ఇది మలయాళ మాసం ధను (డిసెంబర్-జనవరి) పదకొండవ రోజు వరకు కొనసాగుతుంది. సంవత్సరంలో 41 రోజుల పాటు సాగే ఈ తీర్థయాత్ర కాలాన్ని శబరిమలలోని మండల కాలం అని పిలుస్తారు. మండలపూజ రోజులు శబరిమల తీర్థయాత్రలో అత్యంత రద్దీగా ఉండే కాలం.
శబరిమలను సందర్శించాలనికోరకుునేభక్తులు అనేక కఠినమైన ఆచారాలు మరియు సంప్రదాయలను పాటించాలి. 41 రోజుల పాటు కఠినమైన వ్రతం (అయ్యప్ప దీక్ష) ఉండాలి, అలానే బ్రహ్మచర్యం పాటించి, ఆలయానికి వెళ్ళే ముందు పవిత్ర మాలను ధరించి తమ పాపాలను తొలగించుకోవాలి. భక్తులు కష్టసాధ్యమైన మార్గాలను అధిగమించి, కరిమలను దాటి, పంబాలోని పవిత్ర జలాల్లో స్నానమాచరించి, శబరిమల వద్ద అయ్యప్ప సన్నిధిలో ఓదార్పు పొందేందుకు నీలిమల మీదుగా వెళ్తారు. సంప్రదాయ ఇరుముడి కెట్టు (నైవేద్యాల రెండు భాగాల పవిత్రమైన సంచి) ధరించిన భక్తులను మాత్రమే 18 పవిత్ర మెట్లు ఎక్కి స్వామిని దర్శించడానికి అనుమతిస్తారు. ఈ కఠిన ఆచారాలు, సంప్రదాయాలు, వస్త్రధారణ, ఆహారం మొదలైన వాటికి సంబంధించి 41 రోజుల పరిమితులు శబరిమల యాత్రికులను భారతదేశంలోని ఇతర ఆలయాలకు వెళ్లేవారితో పోలిస్తే ప్రత్యేకంగా నిలిపాయి.
శబరిమలలోని మండల కాలం ముగిసిన తర్వాతి ప్రధాన తీర్థయాత్ర సమయం మకరవిళక్కు ఉత్సవం, ఇది ఆలయంలో ఉత్సవాలను సరికొత్త స్థాయికి తీసుకువెళుతుంది. ఏటా మకరసంక్రాంతి రోజున (జనవరి మధ్యలో) మకరవిళక్కు రావడంలో సీజన్ ముగింపును సూచిస్తుంది. శబరిమల సమీపంలోని పొన్నంబలమేడ్ పర్వతం వద్ద మకరవిళక్కు దీపం అని మకరజ్యోతిని వెలిగించడం ఈ రోజుకు సంబంధించిన ప్రధాన ఆచారం. మకరజ్యోతిని దర్శించడం శుభప్రదంగా భావిస్తారు. సన్నిధానం, పాండిత్తావలం, శరంకుత్తి, మరక్కూట్టం, పుల్లుమేడ్, హిల్టోప్, నీలిమల, చాలక్కయం, అట్టతోడ్ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. మకరవిళక్కుతో సంబంధించిన మరో ఆసక్తికరమైన సంఘటన తిరువాభరణం ఊరేగింపు. అయ్యప్ప స్వామి పవిత్ర ఆభరణాల ఉత్సవ ఊరేగింపు ప్రతి సంవత్సరం మకరవిళక్కు పండుగకు మూడు రోజుల ముందు పందళంలోని వలియకోయిక్కల్ ఆలయం నుండి ప్రారంభమై, మకరవిళక్కు రోజున సన్నిధానానికి చేరుకుంటుంది. ఈ ఉత్సవం ముగిసిన వెంటనే, ఆలయంలో సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన సమయం ముగుస్తుంది.
ఈ రెండు కార్యక్రమాలతో పాటు, ప్రతి మలయాళ మాసంలో మొదటి ఐదు రోజులు, విషు మరియు ఓణం వంటి ఇతర శుభ సందర్భాలలో కూడా ఆలయాన్ని తెరుస్తారు. ఈ రోజుల్లో ప్రతిరోజూ పూజల కొరకు తెల్లవారుజామున 3.00 గంటలకు గర్భగుడిని తెరుస్తారు. రాత్రి 11.00 గంటలకు హరివరాసనం పాడిన తరువాత దేవాలయం తలుపులు మూస్తారు
హరివరాసనం
ప్రతి రాత్రి శబరిమల ఆలయంలో, గర్భగుడి తలుపులు మూసివేయడానికి ముందు అయ్యప్ప స్వామికి అంకితమై హరివరాసనం జోలపాటగా ఆలపిస్తారు. ఈ పాట హరివరాసనంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. పాట నిదానంగా ముగుస్తుండగా, జూనియర్ పూజారులు గర్భగుడి నుంచి ఒక్కొక్కరుగా బయటకువస్తారు. ఆ తరువాత మేల్‌శాంతిగా పేర్కొనే ప్రధాన పూజారి శ్రీకోవిల్‌లో పవిత్ర దీపాలు సున్నితంగా ఆర్పివేసి ఆలయాన్ని మూసివేస్తాడు. ఈ ఆచారాన్నే కేవలం ఇక్కడ శబరిమల ఆలయంలో మాత్రమే చూడవచ్చు.
హరివరాసనం కీర్తన అయ్యప్ప స్వామివారిని (ధర్మశాస్తా అని కూడా పిలుస్తారు)ను తల నుంచి కాలి వరకు వర్ణిస్తుంది. హరివరాసనలో మొత్తం 16 శ్లోకాలు ఉంటాయి. వాటిలో ఎనిమిది శ్లోకాలు ప్రతిరోజు రాత్రి శబరిమలలో ఆలపిస్తారు."