తీర్థయాత్ర ప్రారంభించడానికి ముందు భక్తులు 41 రోజులపాటు వ్రతం లేదా అయ్యప్ప దీక్ష (బ్రహ్మచర్యం మరియు శాఖాహార భోజనం) ఆచరించాల్సి ఉంటుంది. గుడికి రావడానికి ముందు, భక్తులు కెట్టునిర అనే కార్యక్రమంలో పాల్గొంటారు, దీనిలో వారు ఇరుముడిని (ఇరుముడి కెట్టు) తయారు చేస్తారు. ఇరుముడి అనేది రెండు భాగాలుండే చిన్న సంచి. మొదటి భాగాన్ని మున్ముడి అని, వెనక భాగాన్ని పిన్ముడి అని అంటారు. మున్ముడిలో ఆలయానికి సమర్పించే నైవేద్యాలు మరియు పూజా సామాగ్రి ఉంటుంది మరియు పిన్ముడిలో భక్తుని వ్యక్తిగత వస్తువులుంటాయి.

పాటించాల్సిన ఆచారాలు

అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభవానికి నెలవైన శబరిమలను మీరు ప్రతిరోజూ లేదా ఎప్పుడైనా సందర్శించగల ఆలయం కాదు. ఈ ఆలయం మరియు తీర్థయాత్రకు సంబంధించిన వివిధ ఆచారాలు ఉన్నాయి, వీటిని యాత్రను ప్రారంభించే ముందు భక్తులు గౌరవించి పాటించాలి. వీటిలో ఈ దిగువ పేర్కొన్నవి ఉంటాయి:

మాలధారణ (మాలయిడల్)

మండల వ్రతం (అయ్యప్ప దీక్ష) మాలధారణతో ప్రారంభం అవుతుంది. ఇది మల (పూసల గొలుసు) ధరించడాన్ని సూచిస్తుంది, ఇది 41రోజులపాటు వ్రతం (అయ్యప్ప దీక్ష) చేయడానికి సుముఖకు సూచిక. ఈ మాలలో తరచుగా అయ్యప్ప స్వామి చిత్రంతో కూడిన లాకెట్ ఉంటుంది. మాలధారణతో, సంయమన కాలం అధికారికంగా ప్రారంభమవుతుంది. మాల తరచుగా ఆలయ పూజారి లేదా గురుస్వామి (శబరిమలకు 18 తీర్థయాత్రలు పూర్తి చేసిన వ్యక్తి) నుండి స్వీకరించబడుతుంది. తీర్థయాత్ర పూర్తయిన తర్వాతే మాలను తీసివేస్తారు.

మండల వ్రతం (అయ్యప్ప దీక్ష)

తీర్థయాత్ర ప్రారంభించడానికి ముందు 41 రోజుల పాటు సాగే తపస్సును మండల వ్రతం (అయ్యప్ప దీక్ష) అంటారు. ఈ కాలంలో భక్తులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటూ నిరాడంబర జీవితం గడపాలని, క్రమశిక్షణను అలవర్చుకోవాలని, ఆరోగ్యకరమైన ఆచారాలకు కట్టుబడి ఉండాలని సూచించబడుతుంది. రోజంతా స్వామికి ప్రార్థనలు చేస్తారు, మరియు భక్తులు నలుపు రంగు దుస్తులు ధరిస్తారు, ఇది భౌతిక వస్తువుల నుండి నిర్లిప్తతను సూచిస్తుంది. ఈ సమయంలో జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం మరియు గోళ్లను ట్రిమ్మింగ్ చేసుకోవడం నిషేధించబడింది.

కెట్టునిరక్కల్

శబరిమల తీర్థయాత్రకు సంబంధించిన ముఖ్యమైన ఆచారాలలో ఇరుముడి కట్టడం. ఇరుముడి రెండు భాగాలుండే చిన్న సంచి. మొదటి భాగంలో స్వామి నైవేధ్యాలుంటాయి, రెండో భాగంలో భక్తుడి వ్యక్తిగత వస్తువులుంటాయి. ఇరుముడిని తయారు చేసే ప్రక్రియను కెట్టునిరక్కల్ అని అంటారు. దీనిని గురుస్వామి సమక్షంలో చేస్తారు. ఆచారాల్లో భాగంగా, కొబ్బరికాయలో నుంచి నీటిని తొలగించిన తరవుత, దానిలో నెయ్యిని నింపుతారు. ఇది ప్రాపంచిక సుఖాలను తొలగించి వాటి స్థానంలో ఆధ్యాత్మిక ఆలోచనలను తీసుకురావడాన్ని సూచిస్తుంది. ఇరుముడి తయారు చేసిన తరువాత శబరిమలకు చేరుకునే వరకు భక్తుల వద్దే ఉంటుంది. ఇరుముడి లేని భక్తులెవరినీ 18 పవిత్ర మెట్లు ఎక్కేందుకు అనుమతించరు.

ఎరుమేలి పేట్ట తుళ్లల్

ఎరుమేలి పేట్ట తుళ్లల్ అనేది శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆచారం. సాంప్రదాయకంగా, పేట్ట తుళ్లల్ ధను మాసం (డిసెంబర్-జనవరి) మొదటి రోజున ప్రారంభమై అదే నెల చివరి రోజున ముగుస్తుంది. పేట్ట తుళ్లల్ సందర్భంగా కళాకారులు తమ శరీరమంతా గంధపు పొడి మరియు బూడిదను పూయడం, ఆరంజ్ బెర్రీ చెట్టు (గొంజి లేదా కొండ గొలుగు) ఆకులను ధరించి, తలపై ఆకు కిరీటాన్నిఅమర్చుకొని, బాణాలు పట్టుకుని మరియు వారి భుజాలపై ఉన్న కర్ర నుండి వేలాడదీసిన కూరగాయల మూటను మోస్తూ నాట్యం చేస్తారు. అంబలపుళ సమూహానికి చెందిన నృత్యకారులు సన్నిధానానికి వెళ్ళే ముందు వావర్ మసీదులోకి ప్రవేశిస్తారు. ఆలంగాడ్ సమూహం ఈ ఆచారంలో పాల్గొనదు. కళాకారులు శబరిమలకు తరలివెళ్తున్నప్పుడు వారి వెంట వావర్ కూడా వస్తారని నమ్మకం.

తిరువాభరణం

తిరువాభరణం అంటే అయ్యప్పస్వామి విగ్రహాన్ని అలంకరించడానికి ఉద్దేశించిన బంగారంతో చేసిన పవిత్ర ఆభరణాలు. పందళం రాజు తన దివ్య కుమారుడికి గౌరవ సూచకంగా వీటిని తయారు చేసినట్లుగా విశ్వసిస్తారు. మకరవిళక్కు పండుగ రోజు సాయంత్రం దీపారాధనకు ముందు (దీపాలు వెలిగించి స్వామిని పూజించడం) ముందు వాటిని విగ్రహంపై ఉంచుతారు. వారిని మూడు పెట్టెల్లో గర్భగుడిలోకి తీసుకువస్తారు. ప్రధాన పెట్టెలో స్వామివారి ఆభరణాలు ఉంటాయి. మకర మాసంలో ఐదవ రోజున (జనవరి-ఫిబ్రవరి) కలభాభిషేకం (గంధం మరియు ఇతర సువాసన పదార్థాల మిశ్రమంతో స్వామిని అభిషేకం చేయడం) చేస్తారు. రెండవ పెట్టెలో బంగారు కుండలు ఉంటాయి, వీటిని కలభాన్ని నిర్వహించడానికి ఉపయోగిస్తారు. మూడవది ఆలయ చిహ్నం, తిడంబు (సాధారణంగా ఏనుగు పైన ఉంచబడే బంగారు ఫలకంపై దేవతా ప్రతిరూపం) మరియు ఏనుగుకు శిరస్సుకు అలంకరించే అలంకారాలు ఉంటాయి. ఈ పెట్టెలను పందళం రాజుకు చెందిన రాజప్రాసాదంలోని స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచుతారు. రాజ ఆభరణాలను శబరిమలకు తీసుకెళ్లే ముందు యాత్రికులు వాటిని తిలకించే అవకాశం లభిస్తుంది.

తిరువాభరణ ఘోషయాత్ర (తిరువాభరణ ఊరేగింపు)

మకరవిళక్కు పండుగ రోజున పవిత్ర ఆభరణాలను ఆలయానికి తీసుకెళ్లే ఆలయ అధికారుల వెంట వచ్చే భక్తుల ఊరేగింపు ఇది. మొత్తం ప్రయాణం దూరం దూరం దాదాపు 83 కిలోమీటర్లు, ఇది మూడు రోజుల వ్యవధిలో పూర్తవుతుంది. పందళంలోని వలియ కోయిక్కల్ ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు భక్తిశ్రద్ధలతో తారాస్థాయికి చేరుకుంటుంది. పెట్టెలను పల్లకిలో తరలిస్తారు, మరియు రాజకుటుంబానికి చెందిన ప్రతినిధి ఊరేగింపుతో పాటు ఉంటారు. గత 68 ఏళ్లుగా కులతుంక్కల్ గంగాధరన్ పిళ్లై స్వామి తలపై రాజ ఆభరణాలు మోస్తున్నారు. ఈ ఊరేగింపుకు దారి పొడవునా వివిధ ఆలయాల్లో ఘన స్వాగతం పలుకుతారు. మకరవిళక్కు ఉత్సవం ముగిసిన తర్వాత తిరిగి వచ్చి, కలభాభిషేకం చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు.

తంక అంకి

మకరవిళక్కు రోజున అంటే మకర మాసం (జనవరి-ఫిబ్రవరి) మొదటి రోజున అయ్యప్ప స్వామి విగ్రహానికి బంగారు ఆభరణాలు ఉంచుతారు. అయితే 1973 లో ట్రావెన్‌కోర్ (ట్రావెన్‌కూర్ / తిరువితాంకూర్) మహారాజు చిత్తిర తిరునాళ్ బాల రామవర్మ బహుమతిగా ఇచ్చిన 420 సావరిన్ల బరువున్న తంక అంకి (బంగారు వస్త్రధారణ) - మండలపూజ సమయంలో (ఆలయం ప్రధాన పండుగ, మలయాళ మాసం వృశ్చికం (నవంబర్-డిసెంబర్) మొదటి రోజు మరియు మలయాళ మాసం ధను [డిసెంబర్-జనవరి] పదకొండవ రోజు మధ్య 41 రోజుల వ్రతం (అయ్యప్ప దీక్ష) ముగింపులో) విగ్రహంపై ఉంచుతారు. ఆరన్ముళలోని పార్థసారథి ఆలయం నుంచి ప్రత్యేకంగా రూపొందించిన రథంలో తంక అంకిని శబరిమలకు ఎంతో భక్తిశ్రద్ధలతో తీసుకువస్తారు. మండలపూజ అనంతరం తిరిగి తీసుకెళ్లి ఆరన్ముళ ఆలయంలోని స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరుస్తారు.

వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి

Icon for Go To Top